మూర్ఖులు అని ఎవరిని అంటారు?
Answers
మిమ్మల్ని మీరు నిజంగా ఒక ఆనందమయ వ్యక్తిగా మలచుకుంటే, మీరు ఒక మేధావి అయి ఉండాలి. అవునా, కాదా? ఎందుకంటే మీరు మీ జీవితపు ప్రాథమిక ఉద్దేశాన్ని నెరవేర్చారు. అది మీ జీవితపు అంతిమ ఉద్దేశం కాకపోవచ్చు. కాని, మీరు కనీసం మీ జీవితపు ప్రాథమిక ఉద్దేశాన్ని నెరవేర్చారు.
ఈ ప్రపంచంలో మీరు ఎవరిని మేధావి అంటారు? వారు చేయాలనుకున్న దానిని నెరవేర్చిన వారిని, వారు ఆడాలనుకున్న ఆటలో గెలిచిన వారిని, ఒక నిర్దేశిత దారిని ఎంచుకుని గమ్యాన్ని చేరిన వారిని మీరు మేధావులు అంటారు. అవునా, కాదా? ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు. కనుక, ఒక వ్యక్తి స్వతహాగానే. అంటే కేవలం తన స్వభావపరంగానే ఆనందంగా ఉంటే, అతను కచ్చితంగా మేధావి అయి ఉండాలి. సామాజికంగా, ఇతరులు ఎవరైనా అతనిని మూర్ఖుడు అనుకోవచ్చు. ఆ ఆనందంగా ఉన్న ఒక వ్యక్తిని చూసి మూర్ఖుడు అనుకునే అసలైన మూర్ఖుడికి జీవితంలో తను ఏమి కోల్పోతున్నాడో తెలియదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. డబ్బు సంపాదించుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇది కావాలి, అది కావాలి, అనే విషయాలను ఏ మాత్రం పట్టించుకోనంత ఆనందంగా ఉండవచ్చు. మంచి బట్టలు వేసుకుని, ఎక్కువ ధనం ఉన్న వారు ఈ వ్యక్తిని చూసి మూర్ఖుడనుకోవచ్చు. ఆనందంగా ఉన్న ఈ వ్యక్తి గురించి ‘‘అతను కేవలం ఆనందంగా ఉన్నాడు, అతను స్వతహాగా ఆనందంగా ఉన్నాడు. చింపిరి గుడ్డలతో, వీధిలో ఉన్నా, అతను ఆనందంగా ఉన్నాడు. ఎంత మూర్ఖుడు! అని అనుకోవచ్చు. కానీ చూడండి ఎవరు నిజమైన మూర్ఖుడో.
అతి కష్టం మీద మీరు వీటన్నిటినీ పోగు చేసుకుంటారు. ఎందుకంటే వాటితో మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు ఆనందంగా లేరు, అంటే మీరు మూర్ఖులు కాదా? ఎవరైతే ఏమీ చేయకుండానే, స్వతహాగానే ఆనందంగా ఉన్నాడో, అతను మూర్ఖుడా? ఎవరు తెలివైన వ్యక్తి? తాను ఏ ఉద్దేశం కోసమైతే పనిచేస్తున్నాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగే వ్యక్తే తెలివైన వ్యక్తి. అవునా, కాదా? కాబట్టి సామాజికంగా మీరు అతని గురించి ఏమనుకున్నా దానికి విలువలేదు. కనుక, ఆనందంగా ఉన్న వ్యక్తి స్పష్టంగా ఒక మేధావే!
బాధలో ఉండే వారే ప్రపంచంలో మేధావులుగా చెలామణి అవుతున్నారు. ఎందుకంటే వారి మనసులలో పిచ్చి ప్రశ్నలు, జటిలతలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు వారికి బాధను, భారాన్ని కలిగించే ఈ అనవసర జటిలతలు మేధస్సుగా కీర్తించబడుతున్నాయి. కేవలం హద్దుల్లేని మానసిక చర్యలను మేధస్సుగా భావిస్తారు. కానీ అది మేధస్సు కాదు. మీరు అసలు ఏ ఆలోచనలు లేకుండా పూర్తి అప్రమత్తతతో ఉన్నప్పుడు అదే నిజమైన మేధస్సు. అప్పుడు మేధస్సు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో పనిచేస్తుంది