శ్రీకాళస్తీశ్వర శతక కర్త గూర్చి రాయండి
Answers
ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ క్రీ.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం. శ్రీకాళహస్తీశ్వర శతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణ దేవరాయల సభలో అష్ట దిగ్గజములు అనబడు ఎనిమిది మందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమా నారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తి మాహాత్మ్యము వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండె పాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’. ధూర్జటి రచనలుగా మనకు లభించునవి రెండు. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము భాష విషయమున ఈ రెండు రచనలును రెండు వేరువేరు మార్గములలో నడచినట్లు కనబడును. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తి క్షేత్ర పతియగు శ్రీకాళహస్తీశ్వరుని మహిమమును బహువిధములుగా తెలుపు స్థల పురాణము. కావ్యముగా ఇది ప్రబంధము. ఎందుకంటే ఇది పంచభూత లింగములలో ఒకటిగా వాయు లింగ రూపుడగు శివుడు వర్ణనీయుడుగా రచించబడిన వస్తుప్రధాన కావ్యము. శ్రీకాళహస్తీశ్వర శతకము, భక్తుడు తన మనస్సులోని భక్తి మొదలగు భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించబడిన కావ్యము. కవి తన హృదయమును అనుదినమును మాటలాడు వాడుక భాషలోనే భగవంతుని ఎదుట ఉంచుటకై చేసిన రచన ఇది. అందుకు తగినట్లే ఈ శతక రచమలోని భాషను, అంటే వాక్యనిర్మాణాన్ని, వాడుక తీరులోనే చేయడమైంది.