నీతిని తెలియజేసే నాలుగు సుమతి పద్యాలు
Answers
Explanation:
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.
వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం: పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
వరి పంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.
వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.