about village in telugu
Answers
Explanation:
భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అని, ఈ భూమ్మీద అత్యంత అందమైన గ్రామాలు కొన్ని మన దేశంలోనే ఉన్నాయని చెబుతుంటారు. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే మీరు కూడా సరిగ్గా ఈ మాటలతో ఏకీభవిస్తారు. భారతదేశం యొక్క అసలైన అందాన్ని, ఆధునికత అంటుకోని సామాన్య గ్రామీణ జీవనాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ గ్రామాలను చూస్తే మీరు ఓ పాత ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి చెందుతారు. గొప్ప సంస్కృతి, ఆచరణల కారణంగానే వీటికి ఈ ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సాధారణ పర్యాటక మార్గాలకు దూరంగా దాగి ఉన్న ఈ గ్రామాలను అన్వేషించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నగర జీవితానికి దూరంగా శాంతి, ప్రశాంతతను చేకూర్చే ఈ అందమైన గ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆ గ్రామాలు ఏమిటి? ఎక్కడ ఉన్నాయి? అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం.
జంజెలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న జంజెలి గ్రామం దేశంలోని అత్యంత సుందరమైన గ్రామాల్లో ఒకటి. మండి జిల్లాలో ఉన్న ఈ గ్రామం నగర వాణిజ్య జీవనానికి దూరంగా, ప్రశాంతతను కోరుకునే వారికి గొప్ప గమ్యస్థానంగా నిలుస్తుంది. ఇక్కడి రోడ్ల వెంబడి ఉండే కేఫ్ లు లేదా దుకాణాల వద్ద కూర్చుని సూర్యుడి వెలుగులో సేదతీరడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. శిఖరి మాత దేవాలయం వంటి అనేక ఆలయాలను ఇక్కడ సందర్శించవచ్చు. సాహస ప్రేమికులకు హైకింగ్, ట్రెక్కింగ్, నైట్ సఫారీ వంటి అనేక బహిరంగ క్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి.
మవ్లినాంగ్, మేఘాలయ

మేఘాలయ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన చిన్న గ్రామం మవ్లినాంగ్. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే గ్రామంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామంలో శుభ్రతను చూస్తే మీరు ఆశ్చర్యపడకమానరు. ఈ గ్రామాన్ని అన్వేషించడంతో పాటు అక్కడి స్థానికులను ప్రేమగా పలకరించడం ద్వారా వారి జీవన విధానం, సంస్కృతి గురించి మరింత తెలుసుకోవచ్చు. సందర్శకులకు ఆ గ్రామస్తులు ఎంతో సాదరంగా ఆతిధ్యమిస్తారు. పర్యావరణ హితంగా జీవిస్తున్నందుకు వారెంతో గర్వపడతారు. ఈ గ్రామంలో ఎత్తైన టవర్ ఎక్కి 360 డిగ్రీల కోణంలో గ్రామ అందాలను వీక్షించవచ్చు. వెయ్యి సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన వృక్షాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.