ESSAY on kummari in telugu
Answers
కనుమరుగైన కుమ్మరి కులవృత్తి
ప్రజాశక్తి - వెల్దుర్తి
కుమ్మరి తాను చక్రం తిప్పుకుంటూ తన చేతులతో అలవోకగా కుండలు తయారు చేస్తుంటే ఎంతటివారైనా చూస్తు ఉండిపోవాల్సిందే. ఈ వృత్తి పని ఆ కులస్తులు తప్ప ఇతరులకు అబ్బిన దాఖలాలు ఎక్కడా కనపడవు. అంతటి నైపుణ్యం వారికే సొంతం. అలాంటిది భారతవనిలో ఒక చరిత్ర కలిగిన మట్టికుండలు తయారు చేసి వాటిని అమ్మి జీవనం సాగించే శాలివాహన(కుమ్మరి) వారి కులవృత్తి కనుమరుగువుతుంది. ఎంతో నైపుణ్యం, ప్రతిభ గల ఈ వృత్తి చేసేవారికి జీవనోపాధి కల్పించలేక మరుగున పడిపోతోంది. ఆధునీకరణ, సాంకేతికత తోడై మట్టికుండలు కేవలం అమ్మవారి బోనాలకు, కావడి కుండలకు పరిమితమైపోయాయి. మట్టికుండల స్థానాన్ని ప్రస్తుతం బిందెలు, రిఫ్రిజిరేటర్లు, కుక్కర్లు, స్టీల్, సిల్వర్ పాత్రలు భర్తీ చేశాయి. దీంతో సంవత్సరంలో కేవలం వేసవికాలంలో మాత్రమే కొద్దిపాటి ఉపాధి దొరుకుతున్న ఈ వృత్తి పనికి కుమ్మరి కులస్తులు దూరమవుతున్నారు. కుండల తయారీకి కావాల్సిన ముడిసరుకైన మట్టి చెరువుల్లో, కొండల్లో, వంకల్లో దొరకడం కష్టతరమై ఒకరొకరుగా వరుసగా ఈ కులవృత్తిని మానేశారు.
మండలంలో ఒకే ఒక్కడు : గతంలో వెల్దుర్తి మండలంలో వెల్దుర్తిలోని 7 కుటుంబాలతో పాటు రత్నపల్లె, బొమ్మిరెడ్డిపల్లె, నర్సాపురం, కలగొట్ల గ్రామాలలో, బేతంచెర్ల మండలంలోని పెండేకల్లు, క్రిష్ణగిరి మండలంలోని కుమ్మరి కులస్తులు కుండలు తయారు చేసేవారు. వారంతా దాదాపు 8 సంవత్సరాల క్రితమే తమ వృత్తిని మానేశారు. కేవలం వెల్దుర్తి మండలంలోని నర్సాపురం గ్రామాంలోని తులసిరాముడు కుటుంబీకులు మాత్రమే కొనసాగిస్తున్నారు.
తులసిరాముడు మాటల్లో విందాం...
నాన్న ద్వారా అబ్బిన పనిని 40 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాను. మండలంలో అందరూ ఈ పనిని మానివేశారు. ఇంత వరకు నాకు ఎటువంటి ప్రభుత్వ ప్రోతాహం లభించలేదు. తమ కుల సంఘాలు సైతం ఏనాడు నా దారికి రాలేదు. బ్యాంకర్లు కులవృత్తులకు రుణసహాయం చేయడం మానేశారు. సమాజంలో మట్టికుండల డిమాండ్ కూడా తగ్గిపోయింది. కేవలం ఎండాకాలంలో కొంత డబ్బులు వచ్చే ఈ పనిని నేరుకోలేక నా వారసులు జీవనోపాధికై కూలీ పనులకు వెళుతున్నారు. ఇక మండలంలో కుమ్మరి కులవృత్తి మాయమవ్వడం ఖాయమన్నారు. ఎండాకాలంలో సొంతంగా అమ్ముకొని సంపాదించుకొనే పరిస్థితులు లేక తమ కులస్తులే దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. అనారోగ్యం పాలవుతున్న పనికి తగ్గ ఫలితం లేదు. అంతేకాకుండా గోటిచుట్టపై రోకలి పొటు అన్నట్లు ఇక్కడ తయారవుతున్న నల్లమట్టి కుండలకు తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తున్న ఎర్రమట్టి కుండల పోటీ ఎదురవుతోంది. పూర్వం గ్రామాలలోని మా ఇళ్ల మధ్య కొనసాగుతున్న ఈ వృత్తి ప్రస్తుతం కాలుష్య కారణాలతో డోన్, కోడుమూరు ప్రాంతాలలో ఊరు బయట కొనసాగుతూ వృత్తి చేసుకోవడానికి స్థలాల బాడుగలు కూడా భారమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఎంతో నైపుణ్యం గల ఈ కులవృత్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం మట్టి కుండల ప్రాధాన్యం తెలుపుతూ వాటి వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. కులవృత్తి కొనసాగిస్తున్న వారికి రుణ సహాయం, ఊరికి దూరంగానైన స్థలాలు, ముడిసరుకు సమకూర్చుకోవడంలో ఆంక్షలను తొలగిస్తూ ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వాలి. బిసిలను వారి కులవృత్తులను ప్రోత్సహిస్తామంటూ గత సభలలో ప్రస్తావించిన ప్రస్తుత టిడిపి ప్రభుత్వం మండలంలోని మా కులవృత్తిని కొనసాగిస్తున్న ఏకైక కుటుంబానైన ఈ వృత్తి మానేయకుండా ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుందే వేచిచూడాలి.
20 ఏళ్ల క్రితమే కులవృత్తిని వదిలేశాం
- కుమ్మరి ఓం, వెల్దుర్తి.
మా కుటుంబం గతంలో కుండల తయారీతో జీవనం సాగించేది. తయారీలో కష్టాలు ఎదురై 20 ఏళ్ల క్రితమే కులవృత్తిని వదిలేశాం. నేను వాహనాల మెకానిక్‌గా స్థిరపడ్డాను. అయితే కులవృత్తిపై ప్రేమతో తెలంగాణలోని జడ్చర్ల, మహబుబ్‌నగర్, గద్వాల, మనరాష్ట్రలోని నంద్యాల, బేతంచెర్ల, మన మండలంలోని నర్సాపురం తులసి రాముడు వద్ద తయారు చేసిన కుండలను తెచ్చుకొని వెల్దుర్తి వారపు సంతలో అమ్ముకుంటున్నాను. ఎండాకాలం మినహా అన్ని కాలల్లో అమ్ముకోలేక నష్టపోతూనే ఉంటాం. మా కులస్తులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం
- కుమ్మరి ఆనంద్, వెల్దుర్తి.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువై, ముడిసరుకు దొరకక మట్టికుండల డిమాండ్ పడిపోతూ కులవృత్తిని మానే శా. వెల్దుర్తిలో 8 కుటుంబాల దాకా కుండలను తయారు చేసేవాళ్ళం. అందరం మానేశాం. ప్రస్తుతం నేను వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాను. ప్రభుత్వం మట్టికుండల వినియో గాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే మాకు జీవనాధారం దొరకడమే కాక పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.