జల సంరక్షణ గురించి సొంత మాటల్లో వ్రాయుము?
Answers
ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. కానీ, మానవుడు తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా నిధులు ఖర్చు చేస్తున్నా సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఋతుపవనాల అనిశ్చితి, ఉష్ణోగ్రతల్లో మార్పులు, జల సంరక్షణపై నిర్లక్ష్యం కారణంగా నీటి ఎద్దడి రానురానూ జటిలమవుతోంది. వర్షాభావ పరిస్థితులతో బావులు, చెరువులు, బోర్లు ఎండిపోవడం సర్వసాధారణమైంది. సమృద్ధిగా వర్షాలు కురవనందున వేసవితో పాటు మిగతా కాలాల్లోనూ మహిళలు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం బిందెలను మోసుకువెళ్లాల్సిన దుస్థితి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే పరిస్థితి తప్పడం లేదు. మహిళలు మంచినీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద, రహదారులపైన ఆందోళనలు చేస్తున్నారు. అభివృద్ధి పేరిట ఇష్టారీతిన అడవులను నాశనం చేయడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు జరిగి రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. ఫలితంగా నీటి వనరులు కనుమరుగైపోవడంతో భవిష్యత్ తరాలకు పెనుముప్పు పొంచి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ నీటి వనరుల్లో భాగమైన బావులు, చెరువులు, వాగులు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రబలుతున్న ఈ జల సంక్షోభానికి గల ముఖ్యకారణం నేటి నాగరిక మానవుడు అవలంబిస్తున్న నీటి వినియోగ పద్ధతులే అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవవ్యకత ఎంతైనా ఉంది. సమగ్రమైన జల సంరక్షణ ద్వారా జల భద్రత చేకూరుతుందని ప్రచారం చేయడానికి ‘జలశక్తి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి పట్టడానికి ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మొదటి దశలో ఏటా జూలై 1 నుండి సెప్టెంబర్ 15 వరకు నైరుతి రుతుపవన సమయంలో, రెండవ దశలో అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఈశాన్య రుతుపవనాల సమయంలో అవగాహన కల్పించాలనే బృహత్తర లక్ష్యాలతో ఈ పథకాన్ని నిర్దేశించారు. వృథాగా పోతున్న వర్షపు నీటి వినియోగం, సమర్థవంతమైన నీటి పొదుపు ప్రణాళికలు గురించి ప్రచారం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సాంప్రదాయ నీటి వనరులైన చెరువులు, బావులు, వాగులను పునరుద్ధరించి, వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. భారీ స్థాయిలో వనీకరణ కార్యక్రమాలను చేపడుతూ, ప్రతి ఇంటి ఆవరణంలో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకొని నీటి వృథాను అరికడుతూ, నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని భావిస్తున్నారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు విద్యార్థులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, సామాజిక ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఒక ప్రజా ఉద్యమంగా సుస్థిర నీటి సంరక్షణకు కృషి చేయాల్సి ఉంది. నీటిఎద్దడి ప్రాతమైన రాజస్థాన్‌లో అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్రసింగ్, మహారాష్టల్రోని రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్నాహజరే జల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, ‘జలశక్తి అభియాన్’ను ఉద్యమంగా తీసుకువెళ్లి నీటి కరవుకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
hope it helps you