Vasavi kanyaka parameswari story in telugu
Answers
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం (Sri Vasavi Kanyaka Parameshwari Temple) గురించి ఎంతోకొంత దాదాపు అందరూ వినే ఉంటారు. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
పెనుగొండలో పూర్వం వైశ్యులే అత్యధికంగా ఉండేవారు. ఆ గ్రామంలో ఉండే కుసుమ శ్రేష్టి దంపతుల కూతురు వాసవి. ఆమె గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్య తునకలా ఉండేది. వాసవి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యేవారు.
ఒక సందర్భంలో రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. తాను వాసవిని పెళ్ళి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పాడు. కానీ వైశ్యులెవరూ అందుకు అంగీకరించలేదు. దాంతో రాజు ఆగ్రహించాడు. మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు.
రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించిన వైశ్యులు రాజును ఎదిరించలేకపోయారు. అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు దిగి రాలేదు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడచుకోలేక, రాజుతో పోరాడలేక విరక్తి చెంది అందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు.
అదంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది. రాజును నిందిస్తూ, శాపవచనాలు పలుకుతూ ఆమె కూడా అగ్నిలో దూకేసింది. రాజు జరిగినదానికి దుఃఖిస్తూ వెనుతిరిగి వెళ్ళాడు.
పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిచ్చింది. గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆనందపరవశులయ్యారు. వైశ్య కులస్తులు ఆత్మాహుతి చేసుకున్న వాసవి అమ్మవారి రూపంలో అవతరించిందని భావించారు. వెంటనే వాసవికోసం ఒక ఆలయం కట్టించారు. అదే ప్రసిద్ధ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం.
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం, వాసవి తల్లిదండ్రులు కుసుమశ్రేష్టి, కౌసుంభిల విగ్రహాలు, నవగ్రహాలు మొదలైనవి ఉన్నాయి.
ప్రస్తుతం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మరింత తీర్చిదిద్దారు. స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. అటు తమిళులు, ఇటు తెలుగువారు కూడా ఈ ఆలయం పట్ల అత్యంత భక్తిప్రపత్తులతో ఉన్నారు.