pustakasamiksha in telugu
Answers
మాల్గుడి
అనే ప్రాంతం హిమాలయాల అంచులనుంచి కన్యాకుమారి సంద్రపు ఒడ్దు వరకు ఎక్కడా
లేదు. ఆ ప్రాంతానికి పోస్టల్ పిన్ కోడ్ కూడా లేదు. ఎవరైనా సాహిత్య
ప్రియులని, స్కూల్ విద్యార్ధులని అడిగితే మాత్రం మాల్గుడి ప్రాంతం ఆర్. కె.
నారాయణ్ కథల్లో వుందని టక్కున చెపుతారు.
ఇంతకన్నా
వివరించక్కర్లేదు ఆర్. కె. నారాయణ్ గారి గురించి, ఆయన వ్రాసిన 'మాల్గుడి
కథల' సంపుటి గురించి. ఆనాడు తను చూసిన సమాజంలోని వివిధ రకాల వ్యక్తులు,
వారి మనస్తత్వాలు, చేసే పనులు, ఇంట్లో పెంచుకునే పెంపుడు
జంతువులు, ప్రతినిత్యం చూసే అంగడి, బ్రతుకు తెరువు కోసం పడే పాట్లు వీటినే
కథా వస్తువులుగా తీసుకుని మనసు తడిమే అద్భుతమైన కథలుగా వ్రాసేవారు.
నారాయణ్
గారి కథల్లో పాత్రలు, పాత్ర స్వభావాలు, పాత్ర చుట్టూ అల్లుకున్న
ఇబ్బందులతో కథ నడిపిస్తూ చదివే పాఠకుడిని కూడా ఆ పాత్రలతో
ప్రయాణింప చేస్తారు. మన దైనందిన జీవితంలో చూసి, విన్న వ్యక్తుల్లాగే ఆ
పాత్రలు కూడా కదలాడుతూ వుంటాయి. కథ ముగియగానే మనం పేజి తిప్పి మరో కథలోకి
వెళ్ళలేం. చదివిన కథ ముఖ్య పాత్ర దగ్గరే ఆగి, ఆ పాత్ర తరువాతి ప్రయాణం
ఎలాసాగుతుంది? ఆ పాత్రని ఎందుకలా ముగించారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. కథని
దాటి ఊహా లోకంలోకి వెళ్లి ఆ ప్రాత్రని పలకరించాలనిపిస్తుంది. అదే నారాయణ్
గారి ప్రత్యేక శైలి .
'ఈశ్వరన్' కథకు నారాయణ్ గారిచ్చిన ముగింపు ఆయనమీదే కోపాన్ని తెప్పిస్తుంది.
'గుడ్డి కుక్క' కథలోకి వెళితే ఎక్కడున్నా పరిగెత్తుకెళ్ళి ఆ కుక్కని పెంచుకోవాలనిపించేంత జాలి.
'ప్రియమైన బానిససత్వం' కథలో మనిషి విలువ ఇంతేనా అనిపిస్తుంది.
'నలబై
అయిదు రూపాయిలు' కథలో తండ్రికోసం ఎదురుచూసే కూతురు, కూతురి చిన్న కోరిక
కూడా తీర్చలేనంత చాకిరి తండ్రిది . మనమే వెళ్లి ఓ సినిమా చూపిస్తే పోలేదన్న
ఆత్రుత.
ఇక
మాల్గుడి కథలలో భాగంగా 'లాలి రోడ్' సంకలనం నుంచి కొన్ని కథలు ఈ పుస్తకం లో
ప్రచురింప బడ్డాయి.మాటల్లో చెప్పేది కాదు చదివితేనే తెలుస్తుంది లాలి రోడ్
అవిష్కరణ గురించి.
ఈ పుస్తకంలో
ఇలా హృదయాన్ని హత్తుకునే ఎన్నో కథలు, మానవసంబంధాలలోని సున్నిత కోణాలను
ఆవిష్కరించడంలో నారాయణ్ గారికి ఆయనే సాటి. ఇలాంటి అద్భుతమైన 'మాల్గుడి
కథల'ని తెలుగు అనువాదం ఇచ్చిన ఆచార్య సి. మృణాళిని గారిని ప్రత్యేకించి
అభినందించాలి . కథనంలోని ఐరనీని ఎక్కడా పట్టు తప్పనివ్వకుండా నారాయణ్
గారే వ్రాసారాన్నట్టు అనువదించారు.
ఒక రచయిత జీవితకాలంలో చూసిన సంఘటనల సమాహారమే ఈ 'మాల్గుడి కథలు'.
ప్రిసం బుక్స్ ద్వారా విడుదలైన ఈ మాల్గుడి కథలు మీకు మేజర్ బుక్ హౌసెస్ లో లభిస్తాయి.